ఆ రైలుతో ఇక పరేషాన్‌

కొత్తగూడెం : భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ బండి తెల్లవారుజామున 05:45 గంటలకు కొత్తగూడెం నుంచి బయల్దేరేది. ప్రస్తుతం ఉదయం 06:45 గంటలకు షురూ అవుతోంది. డోర్నకల్‌ సమీపంలోని స్టేషన్ల మధ్యలో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనులు, సాంకేతిక లోపాల మరమ్మతుల కారణంగా రైలు నడిచే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే..ఈ ఆలస్యంతో నిత్యం రాకపోకలు సాగించేవారు చాలా అసౌకర్యం చెందుతున్నారు.



ఈ రైలు ఎక్కి డోర్నకల్‌ స్టేషన్‌కు వెళ్లి..అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 05:45 గంటలకు రైలు వెళ్లినప్పడు డోర్నకల్‌ స్టేషన్‌లో హైదరాబాద్, విజయవాడలకు వెళ్లే రైళ్లు ఉండేవి. ప్రస్తుతం మార్పు చేసిన సమయంతో..ఆ ట్రెయిన్లు దొరకట్లేదు. ముఖ్యంగా శాతవాహన, గోల్కొండ, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..అందట్లేదని వాపోతున్నారు. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. రైల్వే అధికారులు చర్యలు చేపట్టి, పాత సమయంలోనే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలును కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.