కన్నీరే మిగులుతోంది.!

చింతలమానెపల్లి(సిర్పూర్‌) : గమ్యం చేరే వరకూ భరోసా లేని పడవ ప్రయాణాలు విషాద రాత రాస్తున్నాయి. గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న పడవల ప్రయాణం ఇంకో మార్గానికి చేర్చుతున్నాయి. పడవ ప్రమాదాలు చోటుచేసుకుని కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండగా, మృతుల కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. పూట గడవడానికి పడవ నడుపుతున్న వారి నిర్లక్ష్యం మూలానికి ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నదీ మీద నిత్యం పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార యంత్రాంగం గుణపాఠం నేర్వడం లేదు. దీంతో విషాద సంఘటనలు పునరావృతమవుతున్నాయి. 



జిల్లాలోని సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యాపార, ఇతర అవసరాల రీత్యా నిత్యం ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. నదులపై వంతెనలు లేకపోవడంతో రేవుల నుంచి నాటు పడవల్లో గట్టు దాటాల్సి వస్తోంది. కౌటాల మండలంలోని వీరవెల్లి, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, రణవెల్లి, చింతలమానెపల్లి మండలంలోని చిత్తామ, గూడెం, బెజ్జూర్‌ మండలంలోని తలాయి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడెం ఓడరేవుల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. చింతలమానెపల్లి మండలం లోని చిత్తామ, గూడెం వద్ద మహారాష్ట్రలోని అహేరి, ఆళ్ళపల్లి, ఏటపల్లి, సిరోంచ, సహా చత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు భారీ రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం కంటే పడవల్లో నదిని దాటితే దూరం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అందుకే చూపుతున్నారు.